వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, విశాఖపట్టణంలో సింహాచలం అనే ప్రాంతంలో, నగరనడిబొడ్డునుండి 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రాన విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్న గా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఈ దేవాలయం సముద్రమట్టానికి 244 మీ ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంది.ప్రస్తుత ఆలయాన్ని 13వ శతాబ్దంలో ఒడిషాకు చెందిన తూర్పు గంగా రాజు లాంగుల నరసింగ దేవ I కళింగ వాస్తుశిల్పం ప్రకారం నిర్మించారు, 1268 ADలో అతని కుమారుడు భానుదేవ I చేత ప్రతిష్ఠించబడింది.
ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం (52 కోట్ల రూపాయలు) కలిగిన దేవాలయం. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతీ సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియ నాడు (మే నెలలో) వస్తుంది.
స్థలపురాణం
పుష్కరిణి
సింహాచలం చరిత్ర ఆధారాలతో సహా పదకొండవ శతాబ్దం వరకు కనిపిస్తుంది. కాని భారత ఇతిహాసాల ప్రకారం ఇది ఇంకా పురాతనమైనదై ఉండవచ్చు. సింహాచలం అంటే సింహం పర్వతం అని అర్థం. ఇక్కడ మహావిష్ణువు దశావతారాలలో నాల్గవదైన లక్ష్మీ నరసింహ అవతారమూర్తిగా వెలశాడు. ఇతిహాసం ప్రకారం రాక్షస రాజు హిరణ్యకశిపుడు విష్ణువుకు బద్ధవైరి. తన కుమారుడైన ప్రహ్లాదుడిని పుట్టుకతోనే విష్ణు భక్తుడు. అనేక విధాల ప్రయత్నించి, కుమారుని విష్ణు విముఖుణ్ణి చెయ్యలేకపోతాడు. చివరికి చంపించేందుకు కూడా ప్రయత్నిస్తాడు. కానీ ప్రతిసారీ ప్రహ్లాదునిని విష్ణుమూర్తి రక్షిస్తాడు. విసిగిన హిరణ్యకశిపుడు ‘విష్ణువు సర్వవ్యాప్తమని చెబుతున్నావు కదా, ఏడీ ఈ స్తంభంలో ఉన్నాడా? చూపించు’ మని స్తంభాన్ని పగలగొట్టగా విష్ణువు నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకొనివచ్చి, హిరణ్యకశిపుని సంహరించి, ప్రహ్లాదుడిని రక్షించాడు.
స్థలపురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటగా వరాహనరసింహ స్వామి విగ్రహన్ని ఆరాదించాడు. ఆ తరువాతి కాలంలో చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు విమానం మీద వెళ్ళుతుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైన శక్తి ప్రభావం వల్ల పురూరవుడి విమానం క్రిందకు ఆకర్షించబడింది. అతడికి పుట్టలో కప్పబడి ఉన్న వరాహనరసింహస్వామి కనిపించాడు. విగ్రహాన్ని సంవత్సరకాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగే టట్లు చేయమని ఆకాశవాణి పురూరవుడికి చెబుతుంది. ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురూరవుడు వరాహనరసింహ స్వామికి దేవాలయాన్ని నిర్మించాడు. ఆ సాంప్రదాయం ఇప్పటికీ పాటించడుతోంది. స్వామిలోని వేడిని చల్లార్చడానికి చందనంతో పూత పూస్తుంటారు. వరాహం నరుడు, సింహం రూపాలు కలిసిన ఈ నరసింహుని అవతార నిజరూపం [[త్రిభంగ ముద్ర]]లో (ఆసనంలో) వరాహం తల సింహం తోక కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది. మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారి నిత్యరూపం ఉంటుంది. ప్రతి సంవత్సరం వచ్చే వైశాఖ శుద్ధ తదియ (వైశాఖ పూర్ణిమకు దగ్గరలో) నాటికి చందనం తీసివేసి నిజరూప దర్శనం ఇస్తారు. .
సింహాచలం నడక దారిలో వరాహ మూర్తి ప్రతిమ
శాసన సమృద్ధి
సా.శ.1087: సింహగిరి స్వామి నరసింహదేవరగా ప్రఖ్యాతుడు. స్వామి వారి ప్రసూనాల కోసం తిరునందనవనం కల్పించే శాసనం. ఇప్పటి నుండి ఈ దేవాలయంలో ద్రావిడ శ్రీవైష్ణవ సంప్రదాయం కనబడుతుంది.
సా.శ.1198: “వాయు స్ఫటికామలాభవపుషే సింహాచలస్థాయినే” = సింహాద్రి నాధుని స్పాటికామలాభ వపువుగా వర్ణించబడింది.
సా.శ.1266: గాంగ నరసింహ చక్రవర్తి స్వామి సన్నిధిలో సంకీర్తనం కోసం నూరుగురు స్త్రీలను స్వామివారికి సమర్పిస్తాడు.
సా.శ.1268: ఒక శాసనం ఈనాటికీ వ్యవహారంలో ఉన్న అడవివరాన్ని పేర్కొన్నది.
సా.శ.1286:
సా.శ.1201, 1291: రెండు శాసనాలు దేవాలయంలో వేద పఠన, అధ్యయన వైభవాన్ని తెలియజేస్తున్నాయి.
సా.శ.1293: అక్షయ తృతీయనాడు చందన కర్పూరాలు చాదడానికి ఒక నిబంధన చేస్తూ, ఆనాడే పాయసము, అప్పాలు మొదలైన పణ్యారాల ఆరగింపు కోసం నిబంధన కనబడుతుంది.
సా.శ.1342: స్వామికి ఒక మహారాణి అనంత లక్ష్మీదేవి అనేక ఆభరణాలు సమర్పించింది. అందులో బంగారు పొగడపూల మాల, సంపెంగ మాల లున్నాయి.
సా.శ.1350: వీరనరసింహదేవుల రాణి గంగా మహాదేవి దేవునికి అనేక సమర్పణలు కావిస్తూ వేయించిన శాసనం.
సా.శ. 1371: సింహాచలం అన్న పేరు సింహికారోగిరిః నుండి వచ్చినట్లు చెబుతోంది.
సా.శ. 1394: సింహగిరి నరహరిని అహోబల దేవరగా పేర్కొనటం జరిగింది.
సింహాచల గోపురం
ఈదేవాలయం లాంగూల గజపతిచే నిర్మించబడిందని పలు శాసనాలు తెలుపుచున్నాయి.ఈ ఆలయం లోని శాసనకాలం సా.శ.1100 నుండి 7శతాబ్దాలవరకు వ్యాప్తం. తూర్పుగాంగులు, రెడ్డిరాజులు, నందపురాన్ని పాలించిన శిలావంశయుజులు, మత్స్య వంశీయులు, గజపతులు స్వామికి అనేకదానాలు గావించిరి.శక సం.1438, 1441 లలో కృష్ణ దేవరాయలు స్వామిని సేవించాడు. శక సం.1438లో కృష్ణదేవరాయలు చిన్నాదేవీ తిరుమలదేవీ సహితుడై ఇక్కడకేతించి స్వామిని అనేక అలంకార వస్తువులు కైంకర్యంలను అర్పించాడు.అనేక గ్రామాలను సా.శ.1441లో ధారపోసినాడు.
గజపతులు పతనమైన తరువాత కుతుబ్ షాహీ వంశం వారు ఈ ప్రదేశంపై దండెత్తి దేవాలయ సంపదను దోచుకొనినారు.సా.శ.1604లో పద్మనాయక కులుడను విప్పర్ణ గోత్రుడును అగు సర్వప్ప అశ్వరాయుడు స్వామికి నిత్యనైవేద్య రాగభోగాలను పునరుద్ధరించి అవి యవిచ్ఛిన్నంగా జరుగునిమిత్తం నరవ అను గ్రామాన్ని సమర్పించాడు.
మిధ్య యుగాన ఈక్షేత్రం విద్యా కేంద్రమని పెక్కు శాసనాలవలన తెలుస్తుంది.శక సం.1275లో గంగానరసింహ భోగకాలాన పురాణాలు పఠించు బ్రాహ్మణులకు జీతమిచ్చునిమిత్తం శృఈ భంఢారాన 52 మాడలను గంగాదేవి యొసగింనది.శా.సం.1305లో సింహాచల మందలి బ్రాహ్మణులకు వేదం చెప్పుటకు జంపూ మహాసేనాపతి యొడ్య పెద్దిభట్టును నియమించాడు. పురాణ కావ్య నాటక వ్యాకరణ కాండవ తైత్తిరీయశాఖలను బోధించు బ్రాహ్మణులకు అదేవిధంగా నారాయణా సేనాపతి నిబంధంల నిచ్చాడు.
కూచిమంచి తిమ్మకవి (1690-1757) కట్టమూరి కామేశ్వరకవి (1830-90) సింహాచల మాహాత్మ్య శ్రీ లక్ష్మీనృసింహ చరిత్ర అనుపేర పేర రచించిన ప్రబంధం సింహచల మహాత్మ్యం వర్ణించారు. కూచిమంచి తిమ్మకవి 5 అశ్వాసాల కావ్యంగా తెలుగులో రచియించి గౌరీవల్లభునికి అంకితమిచ్చాడు.
ఆలయ విశేషాలు
సింహాచల దేవాలయ సింహ ద్వారం లోపలి నుండి కనిపించే దృశ్యం
గాలి గోపురం-సింహ ద్వారం
సింహాచల దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాలు ఉన్నట్టు తూర్పు ముఖంగా కాకుండా, పడమర వైపు ముఖాన్ని కలిగి ఉంటుంది. సాధారణంగా తూర్పున ముఖద్వారం ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తే, పడమర ముఖద్వారం విజయాన్ని ఒసగుతుందని హిందువుల నమ్మకం. కొండ మీద నుండి గాలి గోపురం మీదుగా ఆలయాన్ని చేరుకోవడానికి 41 మెట్లు ఉంటాయి.
కప్ప స్తంభం
దేవాలయపు గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారంలో కప్ప స్తంభం ఉంది. ఈ స్తంభం సంతాన గోపాల యంత్రం పై ప్రతిష్ఠితమై ఉంది. ఇది అత్యంత శక్తివంతమైంది అని భక్తుల నమ్మకం. సంతానం లేనివారు ఈ కప్పస్తంభాన్ని కౌగిలించుకొంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. స్వామి వారికి భక్తులు ఇక్కడే కప్పాలు (కప్పం:పన్ను) చెల్లించేవారు కనుక దీనిని కప్పపు స్తంభం అనేవారు. కాలక్రమేణా అది కప్ప స్తంభం అయింది.
సింహాచలం దేవాలయ వెనుకభాగంలో నరసింహుని విగ్రహం.
సింహాచలం వద్ద గంగధార
జల ధారలు
సింహాచలం కొండల మధ్యలో దేవుని గుడి ఉంది. సింహగిరి జలసమృద్ధి గల ప్రాంతం. ఈ కొండలపై సహజసిద్ధమైన జలధారలు ఉన్నాయి. వీటిలో కొన్ని: గంగధార, ఆకాశధార, చక్రధార, మాధవధార. భక్తులు ఈ ధారలలో స్నానాలు చేసి, దైవదర్శనం చేసి తరిస్తారు. స్వామికి తలనీలాలు సమర్పించుకొన్న భక్తులు సమీపంలోని గంగధారలో స్నానంచేసి దైవదర్శనానికి వెళతారు. ప్రధాన దేవాలయానికి ఈశాన్య భాగంలో సహజసిద్ధమైన నీటి సెలయేరు ఉంది. స్వామి కల్యాణం తరువాత ఈ ఘట్టంలో స్నానం ఆచరిస్తాడు. ఈ ధారపై యోగ నరసింహ స్వామి విగ్రహం ఉంది.
భైరవ వాక
సింహగిరికి మెట్ల మార్గంలో వస్తే కనిపించేది భైరవ వాక. ఆడివివరం గ్రామంలో మెట్ల వద్ద భైరవ ద్వారం ఉంది. ఇక్కడ భైరవస్వామి విగ్రహం ఉంది. ఈ విగ్రహం ఎటువంటి పూజలు పునస్కారాలు అందుకోదు. 13-16 శతాబ్ధాల మధ్య ఈ ప్రాంతం భైరవపురంగా ప్రాముఖ్యత పొందింది.
కొత్తగా నిర్మించిన విచారణ కార్యాలయం.
వరాహ పుష్కరిణి
వరాహ పుష్కరిణి సింహగిరి కొండ క్రింద ఆడవివరం గ్రామంలో ఉంది. ఉత్సవమూర్తులను సంవత్సరానికి ఒకమారు తెప్పోత్సవం నాడు ఇక్కడికి తీసుకొని వచ్చి నౌకావిహారం చేయిస్తారు. ఈ పుష్కరిణి మధ్యలో ఒక మండపం ఉంది.
మాధవధార
మాధవస్వామి దేవాలయం ఉంది. గిరిప్రదక్షిణం సమయంలో భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తారు.
దర్శన వేళలు
ఉదయం 6.30 నుంచి 11.30 వరకు సర్వదర్శనం
ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు రాజభోగం సందర్భంగా అరగంట పాటు దర్శనాలు నిలుపుదల చేస్తారు.
మధ్యాహ్నం 12 నుంచి 2.30 వరకు సర్వదర్శనం
మధ్యాహ్నం 2.30 నుంచి 3 వరకు పవళింపు సేవ. దర్శనాలు ఉండవు
సాయంత్రం 3 నుంచి రాత్రి 7 వరకు సర్వదర్శనం
రాత్రి 7 నుంచి 8.30 వరకు ఆరాధన. దర్శనాలు లభించవు.
రాత్రి 8.30 నుంచి 9 వరకు సర్వదర్శనం
రాత్రి 9.00 పవళింపు సేవ జరిగి తలుపులు మూసివేస్తారు
మరలా ఉదయం 6.30కి యథావిధిగా దర్శనాలు లభిస్తాయి.