శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం, లేదా అన్నవరం సత్యనారాయణస్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా లోని అన్నవరం పట్టణంలో ఉన్న హిందూ-వైష్ణవ దేవాలయం. ఈ ఆలయం రత్నగిరి అనే కొండపై ఉంది.[1] విష్ణువు అవతారమైన వీర వెంకట సత్యనారాయణకు ఈ ఆలయం అంకితం చేయబడింది.
అలయ నిర్వహణ
ఈ ఆలయం 13 మంది సభ్యులతో కూడిన ట్రస్ట్ బోర్డు ద్వారా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ క్రింద నిర్వహించబడుతోంది.[3]
స్థలపురాణం
అన్నవరంలో రత్నగిరి పర్వత శ్రేణి.
స్థలపురాణం ప్రకారం పర్వతశ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనకశ్రీమహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒకడేమో భద్రుడు, ఇంకొకడు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారుతాడు. రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి, మహావిష్ణువు శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామిగా వెలసే రత్నగిరి కొండ, లేదా రత్నాచలం కొండగా మారుతాడు.[4]
తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురానికి సమీపంలో గోరస గ్రామ ప్రభువు రాజా ఇనుగంటి వేంకటరామారాయణిం బహద్దూరు ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను మహా భక్తుడు. ఒకనాడు శ్రీమహావిష్ణువు ఇతనికి, రాజా ఇనుగంటి వేంకటరామారాయణిం బహద్దరు వారికీ ఏక కాలంలో కలలో కనపడి “రాబోవు శ్రావణ శుక్ల విదియ, మఖ నక్షత్రం, గురువారం నాడు రత్నగిరిపై వెలుయుచున్నాను. నీవు నన్ను శాస్త్రనియమానుసారం ప్రతిష్టించి సేవించుం” అని చెప్పి మాయమయ్యారని కథనం
మరునాడు ఇరువురు కలసి, తమకు వచ్చిన కలను చెప్పుకొని, ఖరనామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికే అందరు అన్నవరం చేరుకున్నారు. అక్కడ స్వామివారి కొరకు వెదుకుతుండగా ఒక అంకుడు చెట్టు (కృష్ణకుటజం) కింద పొదలో స్వామి వారి పాదాల మీద సూర్యకిరణాలు పడ్డాయి. వెంటనే వారు ఆ పొదను తొలగించి, స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండ పైకి తీసుకొని పోయి, కాశీ నుండి తెచ్చిన శ్రీమత్రిపాద్విభూతి మహావైకుంఠనారాయణ యంత్రాన్ని విష్ణుపంచాయతన పూర్వకంగా సాధారణ శకం 1891, ఆగష్టు 6 న (శాలివాహన శకం 1813) ప్రతిష్ఠించారు.[4]
ఆలయాన్ని సా. శ. 1934 లో నిర్మించారు. పంచాయతనం ఉండటం చేత దానికి ప్రతీకగా ముందు గణపతి, శంకరుల చిహ్నలు గలవి, శూల శిఖరాలతో ఉన్నాయి.అయిన రెండు చిన్న విమాన గోపురాలు, మధ్యగా ప్రధాన విమాన గోపురం, వెనుకగా ఆదిత్య దేవత, అంబికా దేవతల ప్రతీకలగు చక్రశిఖరాలు ఉన్న మరి రెండు విమాన గోపురాలూ ఉన్నాయి. ఒకే చోట ఇన్ని విధాలైన భిన్న దేవతా చిహ్నాలు ఉండటం అపురూపం.
ఆలయ విశేషాలు
భక్తుల విశ్రాంతి కొరకు ఏర్పాటు చేసిన ఉద్యానవనం.
ఆలయాన్ని సా. శ. 1934 లో నిర్మించారు. పంచాయతనం ఉండటం చేత దానికి ప్రతీకగా ముందు గణపతి, శంకరుల చిహ్నాలు ఉన్నాయి, శూల శిఖరములతో ఉన్నాయి. రెండు చిన్న విమాన గోపురాలు, మధ్యగా ప్రధాన విమాన గోపురం, వెనుకగా ఆదిత్య దేవతా, అంబికా దేవతా ప్రతీకలగు చక్రశిఖరములు ఉన్న మరి రెండు విమాన గోపురాలు ఉన్నాయి. ఒకే చోట ఇన్ని విధాలైన భిన్న దేవతా చిహ్నాలు ఉండటం అపురూపం.
అన్నవరం వద్ద పంపా నది
పంపా నది ఒడ్డున ఉన్న రత్నగిరి మీద ఈ ఆలయం సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తులో ఉంది. ఈ గుడికి పాదచారులు చేరు కోవడానికి 460 మెట్లు ఉన్నాయి. ప్రధాన ఆలయం రథాకారంలో ఉండి, నాలుగు దిక్కులలో నాలుగు చక్రాలతో ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది. ఈ కళ్యాణ మండపం ఆధునిక నిర్మాణ చాతుర్యానికి ఒక మచ్చుతునక. వనదుర్గ ఆలయం, రామాలయాలు ప్రక్కన కనిపిస్తూ ఉంటాయి. ఆలయ రూపం, అగ్ని పురాణంలో చెప్పబడినట్లు, ప్రకృతిని తలపిస్తూ ఉండాలి.
ఈ ఆలయం ఆ ప్రకారం రెండు అంతస్తులలో నిర్మింపబడింది. క్రింది భాగంలో యంత్రం, పై అంతస్తులో స్వామి విగ్రహాలు ఉన్నాయి. స్వామి విగ్రహం 4 మీటర్ల ఎత్తు ఉంది. క్రింద గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణుమూర్తిగా అర్చిస్తారు, మధ్యభాగంలో ఉన్నదానిని శివునిగా పూజిస్తారు. మూలవిరాట్టు అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజింప బడడం ఇక్కడి విశేషం. త్రిపాద విభూతి నారాయణ ఉపనిషత్తులో వర్ణింపబడిన యంత్రం ఇక్కడ ఉంది.
రవాణా సౌకర్యం
కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిపై తుని నగరానికి 18 కి.మీ.ల దూరంలో.. కాకినాడ నగరానికి 45 కి.మీ.ల దూరంలో.. రాజమహేంద్రవరానికి 80 కి.మీ.ల దూరంలో.. విశాఖపట్నం నుంచి 120 కి.మీ.ల దూరంలో అన్నవరం ఉంది. అన్నవరం రైల్వేస్టేషన్ ద్వారా రైలు కనెక్టివిటీ ఉంది. విశాఖపట్నం.. రాజమండ్రి విమానాశ్రయాల ద్వారా కూడా అన్నవరం చేరవచ్చు