నైమిశారణ్యం
నైమిశారణ్యం వైష్ణవ దివ్యదేశాలులో ఒకటి. ఇక్కడ వనరూపిగా నున్న స్వామికే ఆరాధన జరుగుతుంది. ఆళ్వార్లు కీర్తించిన సన్నిధిగాని పెరుమాళ్ళు గాని ఇక్కడ లేవు. నైమిశారణ్యం ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో లక్నోకు 94కి.మీ. దూరంలో ఉంది. గోమతినది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం వేలాది సాధు సన్యాసులు తపమాచరించే పవిత్ర ప్రదేశం. వేదవ్యాసుడు నైమిశారణ్యంలోనే మహాభారతాన్ని రచించినట్టు తెలుస్తోంది. మహా భారతం, రామాయణం, వాయుపురాణం, వరాహపురాణాల్లో నైమిశారణ్య ప్రస్తావన ఉంది. వేదవ్యాసుడు వేదాలను, అన్ని పురాణాలను తన శిష్యులకు బోధించిన పరమ పావన ప్రదేశం నైమిశారణ్యం.
ఒకప్పుడు మునులు బ్రహ్మ వద్దకు పోయి భూమి మీద తపస్సు చేయుటకు తగిన స్థలమేదని ప్రశ్నింపగా బ్రహ్మ దర్భతో నొక వలయము చేసి భూమిపై విడచి ఇది పడిన చోట తపస్సు చేయదగిన స్థలమని చెప్పెనట. అది పడిన చోటే నైమిశారణ్యము. ఇచట గోమతీ నది ప్రవహిస్తుంది. ఇక్కడ మహర్షులు అనేక యజ్ఞయాగాదులు చేశారు. ఆ సమయంలో సూతుడు అష్టాదశ పురాణాలు వినిపించాడు.
ఈ అరణ్యంలో దాదాపు 84 వేలమంది మునులతో శౌనక మహర్షి సమావేశమై భాగవత పారాయణం చేశాడని చెబుతారు. వేదవ్యాసుడు మహాభారతగాథను మొదట తన కుమారుడు శుకమహర్షికి ఇక్కడే చెప్పాడు. వ్యాసుడి శిష్యుడైన వైశంపాయనుడు ఇక్కడే ఓ మహాయాగం నిర్వహించి మహాభారత పారాయణం చేశాడు. వైశంపాయనుడు చెప్పిన కథను సూతుడు మరోసారి శౌనకాది మునులందరికీ ఇక్కడే చెప్పాడు. సత్యనారాయణ వ్రతవిధానాన్ని కూడా మొదట నైమిశారణ్యంలోనే సూతమహాముని శౌనికాదులకు వివరించాడు. ఇలా ఎంతో ప్రాధాన్యముంది ఈ అరణ్యానికి. ఇక్కడ వ్యాసమహర్షి ఆశ్రమం, దధీచి ఆశ్రమంతోపాటు కొన్ని దేవాలయాలూ ఉన్నాయి.